ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు ..
వివాహ ఒత్తిడా? ప్రశాంతంగా ఉండేందుకు చిట్కాలు ఇవే!
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు! ఇల్లు సంగతేమో కానీ పెళ్లితో మాత్రం మామూలు ఒత్తిడి కాదు.. ఒకప్పుడైతే అంతా పెద్దవాళ్లే చూసుకుంటూ వధూవరుల వద్దకు ఏ విషయం అంతగా రానిచ్చేవారు కాదు కానీ, ఇప్పుడలా కాదు. తమ జీవితంలో ఒకసారే వచ్చే ఈ అందమైన వేడుకను దగ్గరుండి సంతోషకరంగా ఏ లోటూ లేకుండా జరిపించుకోవాలని అన్నీ తామే చూసుకుంటున్నారు అమ్మాయి, అబ్బాయి. ఈ ప్రక్రియలో ఒత్తిడికి లోనవుతున్నారు. మరి దీన్ని ఎలా అధిగమించవచ్చో, ప్రణాళిక ప్రకారం అన్నీ సిద్ధం చేసుకుని ఆ ఆనంద క్షణాలను ఎలా ఆస్వాదించవచ్చో చూద్దామా! పెళ్లి పనులు ప్రస్తుతం వధూవరులను ఒత్తిడికి గురిచేస్తున్నాయనేది నిజం. కుటుంబ సభ్యులు,బంధుమిత్రులను చూసుకోవడం, ఆర్థిక విషయాలు పరిశీలించడం, షాపింగ్ వంటివి ఎక్కువ ఒత్తిడికి కారణం అవుతుంటే.. పెళ్లిలో నిర్వహించే తంతు, దానికి తగిన ఏర్పాట్లు, భోజన - వసతి సదుపాయాలు చూసుకోవడం.. ఇలాంటి పనులతో ఇంకా సతమతమవుతున్నారట.
ఆర్థిక విషయాలు.. అతిపెద్ద సవాలు
పెళ్లి ఖర్చులకు అవసరమయ్యే నిధులు సమకూర్చుకోవడం అతి పెద్ద సవాలుగా ప్రస్తుతం అమ్మాయి, అబ్బాయి భావిస్తున్నారు. ఏటికేడు పెళ్లి ఖర్చులు పెరిగిపోతూ ఉండటం చూస్తే ఇలా ఎందుకు జరుగుతుందో మనకు అర్థమవుతుంది. ఇటువంటి సమయంలో తల్లిదండ్రులకు తమ పెళ్లిళ్లు ఆర్థికభారం కాకూడదనే ఆలోచనతో యువతీయువకులు తామే ఫైనాన్స్ చూసుకోవడానికి ముందుకొస్తున్నారు. ఇటీవల జరిగిన తాజా సర్వే ప్రకారం మన దేశంలో తమ పెళ్లిళ్లకి తామే ఖర్చుచేసుకోవాలని అనుకుంటున్న యువత దాదాపు 40శాతం ఉన్నారట.వీరు రూ.10 లక్షల వరకూ ఇందుకోసం ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారట. ఇలా బ్యాంకు లోన్లు తీసుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇది వారి ఒత్తిడిని మరింత పెంచుతోంది. కొంచెం ఖర్చుల్లో తేడా వచ్చినా బడ్జెట్ అటూఇటూ అయ్యే అవకాశాలు ఉన్నందున ఈ విషయంలో వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. ముందే కూర్చుని అన్నీ మాట్లాడుకోవడం, బడ్జెట్‌కు తగిన విధంగా మాత్రమే ఏర్పాట్లు చేసుకోవడం వల్ల మధ్యలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాదని చెబుతున్నారు.
సోషల్ మీడియా ఒత్తిడి
పిక్చర్ పర్‌ఫెక్ట్ వెడ్డింగ్ కావాలనే ఆశ, సోషల్ మీడియాలో కనిపించే పోస్టులను చూసి స్ఫూర్తి పొందడం, తాము కూడా అలాగే షేర్ చేసుకోవాలనే తాపత్రయంతో కూడా ఒత్తిడికి గురవుతున్నారు. అలాగే బాగా ఖరీదైన మండపాలు, అలంకరణలు, దుస్తులు, నగలు.. ఒకదాని తర్వాత ఒకటిగా జరిగే ఈవెంట్లు ఇలాంటి వాటిని చూసి తమకూ అలాగే కావాలని కోరుకోవడం, వాటి వెనక ఉండే ఖర్చు, సాధకబాధకాలను అంచనా వేయలేకపోవడం వల్ల ఇలా జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
పెళ్లిళ్ల వంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు, ఇబ్బందులు తలెత్తడం సహజం. వాటిని ఎక్కువగా మనసుకు తీసుకోకుండా వీలైనంత సంయమనంతో ఉండేందుకు ప్రయత్నించడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అదే సమయంలో ఈ మొత్తం ప్రక్రియలో సోషల్ మీడియా పోస్టులకు దిగువస్థాయి ప్రాధాన్యం ఇవ్వడం, కుదిరితే పెళ్లి జరిగిన తర్వాతే దాని గురించి ఆలోచించడం ద్వారా మరింత ప్రశాంతంగా పనులు చూసుకోవచ్చు.
Meet Your Perfect Match Now! Register on Eenadu Pandiri Today!
పెళ్లి తర్వాత..
అప్పటి వరకూ ఒంటరిగా ఉన్న ఇద్దరూ కలిసి జీవించడం మొదలుపెట్టడం, పెళ్లి పనుల బిజీ తర్వాత రొటీన్‌లోకి వచ్చి గడపడం, ఒకరి మీద ఒకరికి ఉన్న అంచనాలుఅందుకునేందుకు ప్రయత్నించడం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత నెలకొల్పడం, బ్రేక్ తీసుకున్న ఉద్యోగ బాధ్యతలను తిరిగి భుజాలకెత్తుకోవడం.. పెళ్లైన కొత్తలో మరో రకమైన ఒత్తిడి తలెత్తుతూ ఉంటుంది. అయితే దీన్ని అధిగమించడానికి ఇద్దరూ కలిసి బాధ్యతలు పంచుకోవడమే మార్గం. కొత్త తరహా జీవన విధానానికి ఇరువురూ అలవాటు పడేవరకూ వేరే ఇతర ఒత్తిళ్లు తీసుకోకపోవడం ఉత్తమం.
అధిగమించొచ్చు ఇలా..
పొద్దున్నే..: రోజూ పొద్దున్నే ఆ రోజు ఏం చేయాలి అనుకుంటున్నామో ఒక మాట అనుకుని నిద్ర లేవడం, కాసేపు యోగా లేదా వాకింగ్ చేయడం, ఒక మంచి టీ లేదా కాఫీతో ప్రశాంతంగా కాసేపు కూర్చోవడం ద్వారారోజును ఒత్తిడి లేకుండా ఆరంభించవచ్చు. దీర్ఘ శ్వాసతో..: బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లను సాధన చేయడం మరో పద్ధతి. ఇవి మన ఆలోచనలను క్రోడీకరించి ఏకాగ్రత కుదిరేలా చేస్తాయి. పుస్తకంలో..: మనల్ని ఒత్తిడికి గురిచేస్తున్న అంశాలను, పనులను ఒకచోట రాసుకోవడం ద్వారా స్పష్టత వస్తుంది. అప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో ప్లాన్ చేసుకోవచ్చు.
రోజు చివర్లో..: రోజును ప్రారంభించమే కాదు, ముగించడం కూడా ముఖ్యం. చక్కని వేడినీళ్ల స్నానం, నచ్చిన సంగీతం వినడం, ఏదైనా మంచి పుస్తకం చదవడం.. ఇలా ప్రశాంతంగా రోజును ముగించడం ద్వారా మరుసటిరోజు మరింత ఉత్సాహంతో పనులు చేయగలుగుతాం. చివరిగా.. పెళ్లంటే రెండు జీవితాల కలయిక, రెండు కుటుంబాల మధ్య పెరిగే అనుబంధం. ఈ ఖర్చులు, ఆడంబరాలు, ఫొటోషూట్‌లు అన్నింటికంటే మనుషులతో ఎంతబాగా కలిసిపోయాం, పెళ్లి తర్వాత ఎంత సంతోషంగా జీవించబోతున్నాం అనేదే ముఖ్యం. అందువల్ల దానిపైనే మన ఫోకస్ ఉంటే.. ఈ ప్రయాణంలో ఎదురయ్యే చిన్నచిన్న ఇబ్బందులను పెద్దగా పట్టించుకోకుండా ఆనందంగా కార్యక్రమం సాగిపోతుంధి.
తరచుగా అడిగే ప్రశ్నలు.
1. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు" అంటే ఏమిటి?
ఈ తెలుగుపదబంధం అంటే "ఇల్లు కట్టడం, పెళ్లి చేసుకోవడం రెండూ జీవితంలో గొప్ప పరీక్షలు. ఇవి చేసి చూసినవారికే నిజమైన జీవిత అనుభవం తెలుస్తుంది" అనే అర్థం.
2. పెద్దలు ఎందుకు ఈ మాట చెబుతారు?
పెద్దలు ఈ నానుడిని ఉపయోగించడం వల్ల, ఇంటి నిర్మాణం మరియు పెళ్లి చేయడం ఎంత కష్టతరమో అర్థమవుతుంది. ఇవి జీవితంలో అనుభవం, బాధ్యతలు, మరియు సహనాన్ని నేర్పే గొప్ప ఘట్టాలు.
3. ఇల్లు కట్టడం, పెళ్లి చేసుకోవడం ఎలా సంబంధం కలిగి ఉన్నాయి?
ఇవీ రెండూ ప్లానింగ్, ఆర్థిక స్థిరత్వం, సహనం, మరియు కృషిని అవసరం చేసే పనులు. ఊహించని సమస్యలు ఎదురైనా, వాటిని అధిగమించడమే నిజమైన విజయం.
4. ఈ నానుడి ఇప్పటికీ వర్తిస్తుందా?
అవును, ఇప్పటికీ వర్తిస్తుంది. ఇంటి నిర్మాణం మరియు పెళ్లి రెండూ జీవితంలో కీలకమైన మలుపులు. ఇవి సరైన రీతిలో చేయాలంటే ఎంతో జాగ్రత్త, సంయమనం అవసరం.
5. ఈ సామెతలో చెప్పిన సవాళ్లను ఎలా ఎదుర్కొని అధిగమించాలి?
సరైన ప్లానింగ్, ఆర్థిక సన్నద్ధత, అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం, సహనం మరియు సమస్యలను పరిష్కరించే నైపుణ్యం పెంచుకోవడం వల్ల, ఇల్లు కట్టడం మరియు పెళ్లి జీవితంలో విజయవంతం అవ్వటానికి సహాయపడతాయి.
2024-01-18 17:15:35