Help / Request Callback
image
Join the family to be a successful story at Eenadu Pellipandiri Register Free

దూరంగా ఉన్నా.. దగ్గరగానే..!

చక్కగా పెళ్లి జరిగింది. అంతా బాగుంది అనుకునేలోపే మీరో తనో బదిలీ వల్లనో, ఇంతకంటే వేరే మంచి అవకాశాలు రావడం వల్లనో దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి. సమయానికి వచ్చిన ఆ అవకాశాలను వదులుకోనూ లేము, అలా అని దూరంగానూ ఉండలేం. కానీ ఇటువంటి సమయాల్లో చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే.. ఈ దూరాన్ని సులభంగా అధిగమించవచ్చు, అందమైన జ్ఞాపకంగా  మలుచుకోవచ్చు. లాంగ్‌ డిస్టన్స్‌ రిలేషన్‌షిప్‌ను ఇలా వర్క్‌ఔట్‌ చేయొచ్చు! సాధారణంగా పక్కపక్కనే ఉన్నప్పటి కంటే దూరంగా ఉన్నప్పుడు అనుబంధం సాఫీగా సాగిపోయేలా భాగస్వాములిద్దరూ మరింత కృషి చేయాల్సి వస్తుంది. ప్రత్యక్షంగా చూసి తెలుసుకునే అవకాశం లేకపోవడం, ప్రతిదీ మాటలపై, నమ్మకంపై ఆధారపడి ఉండటం వల్ల కొంచెం ఇబ్బందనే చెప్పాలి. కానీ కొంత సమయం కేటాయిస్తే ఇదేమంత కష్టమైన పని కాదు.

దూరంగా ఉన్నా, హృదయాలైనా దగ్గరగానే!

Meet Your Perfect Match Now! Register on Eenadu pellipandiri Today!

కమ్యూనికేషన్‌..


దూరంగా ఉంటున్నప్పుడు ఎంత బాగా కమ్యూనికేట్‌ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఎంతసేపూటెక్ట్స్‌ మెసేజ్‌లే కాదు.. తరచూ ఫోన్‌ మాట్లాడటం, కుదిరినప్పుడు వీడియో కాల్స్‌ చేయడం, వీలైనన్నిసార్లు నేరుగా కలవడం అవసరం. కమ్యూనికేషన్‌ తగ్గిపోతే ఏ రిలేషన్‌షిప్‌ అయినా దూరమైపోయిన భావన కలుగుతుంది. దానికి పెళ్లి కూడా మినహాయింపు కాదు. చిన్న చిన్న తగాదాలు, పొరపొచ్చాలు వచ్చినప్పుడు సైతం మాట్లాడుకుని సర్దిచెప్పుకోవాలే తప్ప మౌనంగా ఉండటం సమస్యలను మరింత పెంచుతుంది. అందుకే మాటలు ప్రవహించాలి, సమాచారం పంచుకోవాలి!


మీకంటూ..


దూరంగా ఉండటం వల్ల తనను మిస్‌ అవుతున్నట్లు అనిపించడం సహజం. అలాగే మీకుకుదిరినప్పుడు వారు ఫోన్‌కు అందుబాటులో లేకపోతే మీరు ఇంకా బాధపడే ప్రమాదం ఉంటుంది. అలా అని అస్తమాను ఆలోచిస్తూ, ఫీల్‌ అవుతూ కూర్చోలేం కదా! అందుకే మనసును స్థిరంగా ఉంచుకోవడం ముఖ్యం. మీ పనుల్లో నిమగ్నమైపోండి.. బిజీగా ఉండటం ఒంటరిగా ఉన్నామనే భావనను తొలగిస్తుంది. ఏకాంతాన్ని ఆనందంగా గడపడం, మీకంటూ సమయాన్ని కేటాయించుకోవడం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కాసేపు కాలక్షేపం చేయడం ద్వారా సమయాన్ని సంతోషంగా గడపొచ్చు.


విభిన్నంగా..


దూరంగా ఉన్నప్పుడు రోజూ ఒకేలా మాట్లాడుకోవడం ఏం బావుంటుంది చెప్పండి! కొన్ని రోజులకు బోర్‌ కొట్టేస్తుంది. ఇలాంటప్పుడే విభిన్నమైన కమ్యూనికేషన్‌ సాధనాలు ఏం ఉన్నాయో చూసి వాడటం కొత్తగా ఉంటుంది. ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసుకోవడం, ఫేస్‌బుక్‌ వంటివి రకరకాలైన మెసేజింగ్‌ యాప్స్‌లో మాట్లాడటం, సందర్భానుసారంగా టెక్ట్స్, లంచ్‌ బ్రేక్‌లో కాల్, పొద్దున్న లేవగానే, రాత్రి నిద్రపోయేముందు ఒక తీయటి ప్రేమ సందేశం ద్వారా రోజును సంతోషంగానూ విభిన్నంగానూ గడపొచ్చు.


గాఢంగా..


ప్రేమించేవారు దూరంగా ఉంటే వారితో ఎంత మాట్లాడుతున్నా తనివితీరదు. అలాంటప్పుడు ఉన్న సమయాన్ని గాఢమైన సంభాషణలకు వెచ్చించడం ద్వారా వారికి దగ్గరగా ఉన్న భావనను ఆస్వాదించవచ్చు. చిన్ని చిన్ని సంతోషాల నుంచి లోతైన భావాల వరకూ అన్నీ మనసువిప్పి మాట్లాడండి. ఏవైనా విషయాలు అడగాలి అనుకుంటే మర్చిపోకుండా అన్నీ అడగండి. సంభాషణ అసంపూర్తిగా మిగిలిపోయింది అనే ఫీలింగ్‌ లేకుండా తృప్తిగా మాట్లాడటం ముఖ్యం.


మానసికంగా..


భౌతికంగా ఎంత దూరంగా ఉన్నా మానసికంగా దగ్గరగా ఉన్నామనే ఆలోచన బంధాలను బలపరుస్తుంది. అది సరైన సంభాషణలు, నాణ్యమైన సమయాన్ని గడపడం ద్వారానే సాధ్యమవుతుంది. అదే సమయంలో మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా ఉల్లాసంగా ఉంచేలా జాగ్రత్తపడటం అవసరం. ప్రేమ లేఖలు, తనకు మాత్రమే సొంతమయ్యే లాంటి చిత్రాలు, అన్నీ అనుబంధాన్ని మరింత దృఢం చేసేవే! ఈసారి తనను కలిసేటప్పుడు మీ వస్తువులు అక్కడ కొన్ని వదిలేసి రండి. తనవీ మీరు ఉంచుకోండి. అవి ఒకరికొకరు దూరంగా ఉన్నా, దగ్గరగానే ఉన్న భావన కలిగించేందుకు సాయం చేస్తాయి. తనను తాకిన గాలి మోసుకొచ్చే ఆ గాఢమైన పరిమళాలు తను పక్కన లేనప్పుడు కూడా మనసును తాకుతుంటే ఇక దూరంగా ఉన్నామని ఎందుకు ఫీల్‌ అవుతాం?

Meet Your Perfect Match Now! Register on Eenadu pellipandiri Today!
వీలైనంతగా..


ఎంత కష్టమైనా వీలైనంత వరకూ తనను నేరుగా కలిసేందుకు ప్రయత్నించండి. సమయం, డబ్బు,దూరం, పని ఒత్తిడి ఇలా మిమ్మల్ని వెనక్కి లాగే అంశాలు చాలా ఉండొచ్చు. కానీ వీటన్నింటికంటే నేరుగా కలిసి సమయాన్ని గడపడం ముఖ్యమని గుర్తించండి. ముందుగా ప్రణాళిక వేసుకోవడం ద్వారా తక్కువ ఖర్చుతో, సులభంగా కలిసే వీలుంటుంది. అలాగే ఎప్పుడూ ఒక్కరే కాకుండా ఇద్దరూ సమయం చూసుకుని ఒకరి కోసం ఒకరు వస్తుండటం, వీలైతే ఇద్దరికీ దగ్గరగా ఉండే వేరే ఏదైనా కొత్త ప్రదేశం చూసి రావడం ద్వారా ఉత్సాహంగా అనిపిస్తుం


కలిసి చేసేలా..


ఇంకా కలిసున్నట్టు అనిపించేలా.. ఇద్దరూ కలిసి ఒకేసారి నచ్చిన సినిమా చూడటం, వాకింగ్‌కి వెళ్లి ఫోన్‌లో మాట్లాడుకోవడం ద్వారా పక్కపక్కనే ఉన్నట్టు ఫీల్‌ అవ్వడం, కలిసి ఏదైనా హాబీ నేర్చుకోవడం వంటివి చేయవచ్చు. ఒకేసారి వంట చేసుకుని కలిసి భోంచేయడం, ఇంటి పనుల సమయంలోనూ వీడియో కాల్స్‌ చేసుకోవడం ద్వారా ఎక్కువ సమయం గడపవచ్చు. ఇలా పక్కనే ఉంటే మీ సాయంత్రాలను ఎలా సరదాగా గడుపుతారో అలాగే చేయవచ్చు.


ఏం చేయకూడదు?


కొన్నిసార్లు మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. అవతలి వారు అనుకున్న విధంగా మాట్లాడటానికి వీలు కాకపోవచ్చు. అటువంటి సమయాల్లో మనం కంగారు పడి, వారిని ఇబ్బంది పెట్టకుండా.. నెమ్మదిగా మన ఆలోచనలు పంచుకోవాలి. పరస్పర నమ్మకం, గౌరవంతో మెలగాలి. ఇలా దూరంగా ఉండి మాట్లాడుకునేటప్పుడు ముఖ కవళికలు, శారీరక భాష తెలియక తరచూ మాటలను అపార్థం చేసుకునే అవకాశం ఉంటుందనేది నిపుణుల హెచ్చరిక. అటువంటి ఇబ్బందులకు తావివ్వకుండా ఈ కొత్త తరహా ప్రయాణాన్ని సరికొత్తగా గడపండి!!


- చంద్రమౌళిక సాపిరెడ్డి.
 

2023-08-22 10:21:51

Back