బెస్ట్ హనీమూన్ డెస్టినేషన్స్ పార్ట్ - 2
నచ్చినవారితో గడిపే ప్రతి క్షణమూ అపురూపమే. అదే కొన్ని రోజులపాటు అన్నీ పక్కన పెట్టేసి హాయిగా ఇతర దేశాల్లో పర్యటించి వస్తే ఇంకా బాగుంటుంది. అందులోనూ పెళ్లయిన కొత్తల్లో ఇది అవసరం కూడానూ. ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, జీవితాంతం సంతోషంగా సాగే అందమైన బంధానికి పునాది వేయడానికి. పెళ్లయిన కొత్తను మించిన సమయం ఇంకేం ఉంటుంది? ఇలా తక్కువ ఖర్చుతో వెళ్లిరాగలిగిన బెస్ట్ హనీమూన్ డెస్టినేషన్స్ ఇక్కడ ఉన్నాయి. మరి మీరు ఎక్కడికి వెళ్తారో చూసి నిర్ణయించుకోండి!
బెస్ట్ హనీమూన్ డెస్టినేషన్స్ పార్ట్ - 2 | కొత్త జంటల కోసం ఉత్తమ టూరిస్టు స్థలాలు
సింగపూర్
అప్పుడే మొదలైన మీ జీవితంలో అలా అలా మెరుపులు మెరిపించాలంటే సరదాగా ఓసారి సింగపూర్ వెళ్లి రావాల్సిందే. ఆధునికత ఉట్టిపడే భవంతులు, ధగధగలాడే విద్యుద్దీపాల నడుమ మెరిసిపోయే ఈ నగరపు సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. నిజానికి ఇక్కడ ఏడాదంతా టూరిస్టుల తాకిడి ఉంటుంది. కానీ డిసెంబరు నుంచి జూన్ వరకూ పర్యటించేందుకు అత్యంత అనుకూలమైన సమయం. కేబుల్ కార్Âలో స్పెషల్ క్యాండిల్ లైట్ డిన్నర్, థ్రిల్ కలిగించే రైడ్స్, క్రూయిజ్ ప్రయాణం, డాల్ఫిన్లతో ఆడుకోవడం, జాన్స్ ఐలాండ్‌లో ఫన్.. ఇలా ఎన్నో చేసే వీలుంది. సగటున రూ.60 వేల టూరిస్ట్ ప్యాకేజీలు మొదలవుతాయి.
మాల్దీవులు
చాలామంది వెళ్లాలని ఆశపడే సుందర ప్రదేశం ఇది. ఇది చిన్నచిన్నవిగా విడిపోయిన దాదాపు 200 ద్వీపాల సమూహం. దేనికదే ప్రత్యేకంగా ఉండే అందం వీటి సొంతం. ఇక్కడి మాల్దీవియన్ కల్చర్ విభిన్నమైన సంస్కృతులు, కళలు, ఆహారపు అలవాట్లతో పర్యటకులను ఆకర్షిస్తోంది. డిసెంబరు నుంచి ఏప్రిల్ వరకూ మాల్దీవులకు వెళ్లడానికి మంచి సమయం. ఈ కాలంలో కురిసే చిరుజల్లులు వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చడమే కాదు.. పర్యటకులకు మనసుదోచే మధురానుభూతులను మిగులుస్తాయి. సగటున రూ.40 వేల నుంచి ఈ పర్యటనల ప్యాకేజీలు మొదలవుతాయి.
వియత్నాం
ప్రకృతి ఒడిలో పరవశించాలని తపించే కొత్తజంటలకు వియత్నాం ఒక చక్కని వేదిక. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇక్కడ వర్షాలు తక్కువగా ఉండటంతోపాటు ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదు అవుతూ ఉండటం వల్ల ఈ సమయంలో వెళ్లడం అనుకూలంగా ఉంటుంది. బోట్ రైడ్స్, క్యాంపింగ్.. వంటివి చేసే అవకాశం ఉంది.
ముందుగా ప్లాన్ చేసుకుంటే చాలా తక్కువ ధరలకు విమాన టికెట్లు దొరికే అవకాశం ఉంటుంది. రొటీన్‌కు భిన్నంగా పర్యటించాలని అనుకునేవారికి ఇది బాగా నప్పుతుంది. సగటున రూ.45 వేల నుంచి టూరిస్ట్ ప్యాకేజీలు మొదలవుతాయి.
Meet Your Perfect Match Now! Register on Eenadu Pellipandiri Today!
ఫిలిప్పీన్స్
బయట ప్రపంచానికి అంతగా పరిచయం లేని ఎన్నో అందమైన సముద్రతీరాలు, ఆకట్టుకునే ద్వీపాలు ఈ దేశం సొంతం. ఇండియాకు దగ్గర్లో తక్కువ ఖర్చులో వెళ్లి వచ్చేందుకు ఇదో చక్కని ప్రదేశం. ఇక్కడికి నవంబర్ నుంచి ఏప్రిల్ వరకూ ఉండే డ్రై సీజన్‌లో వెళ్లడం మంచిది. అప్పుడే ముఖ్యమైన ఐలాండ్స్, సుదూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ముందుగా వీసా తీసుకోవాల్సి ఉంటుంది. బీచ్‌లతోపాటు వివిధ రకాలైన స్ట్రీట్ ఫుడ్, కపుల్ అడ్వెంచర్స్ ఆకట్టుకుంటాయి. చరిత్రపై ఆసక్తి ఉన్నవారి కోసం చారిత్రక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. సగటున రూ.35 వేల నుంచి టూరిస్ట్ ప్యాకేజీలు మొదలవుతాయి.
భూటాన్
తూర్పు హిమాలయాలకు ఆనుకుని.. సుసంపన్న సంస్కృతితో అలరారే దేశమిది. పచ్చని పరిసరాల నడుమ ఇక్కడ పర్యటించడం సరికొత్త జీవనశైలిని పరిచయం చేస్తుంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ పర్యటకుల తాకిడి కాస్త తక్కువ. అందువల్ల ఏకాంతానికి ఏమాత్రం లోటుండదు. విమానయానంతోపాటు రోడ్డు మార్గం ద్వారా కూడా ఈ దేశం చేరుకోవచ్చు. మార్చి నుంచి మే వరకూ, పండగల సమయాల్లోనూ చూడటానికి చాలా బాగుంటుంది. సగటున రూ.38 వేల నుంచి ప్యాకేజీలు మొదలవుతాయి. వీసా, పాస్‌పోర్ట్ లేకుండానే ఇండియన్స్ ఇక్కడ పర్యటించవచ్చు. ఇక్కడి పురాతన ఆలయాలు, ప్రకృతి సౌందర్యం పర్యటకులను కట్టిపడేస్తుందంటే అతిశయోక్తి లేదు.
- చంద్రమౌళిక సాపిరెడ్డి.
2023-08-21 16:58:03