మీరు పెళ్లికి సిద్ధమేనా?
వివాహం జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. ఒకప్పుడు పెళ్లికి సంబంధించిన నిర్ణయం తీసుకునేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసేవారు అంటారు. కానీ ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అటుఇటు చూడటం కంటే మనలోకి మనం తొంగిచూడటం చాలా అవసరమని చెప్పాలి. మనం చేసుకునే పెళ్లి జీవితాంతం మనకు సంతోషాన్నివ్వాలి అనుకునే ప్రతిఒక్కరూ. వివాహానికి ముందు తమను తాము కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి అంటున్నారు నిపుణులు.
మీరు పెళ్లికి సిద్ధమేనా? - వివాహానికి ముందుగా తెలుసుకోవాల్సిన అంశాలు
ఈ పెళ్లి ఎందుకు చేసుకోవాలి అనుకుంటున్నాను?
చాలామంది తాము ఎందుకు ఈ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారో ఆలోచించరు. ‘అందరూ చేసుకుంటున్నారు.. మనమూ చేసుకుందాం’ అనే ధోరణి అన్నివేళలా సరిపోదు. ఈ అనుబంధం నుంచి మనమేం కోరుకుంటున్నాం, వీరినే ఎందుకు జీవితంలోకి ఆహ్వానిస్తున్నాం అనేది ప్రశ్నించుకుంటే. జవాబు ఎలాంటిదైనా నిర్ణయంపై స్పష్టత వస్తుంది. జీవితాంతం దానికే కట్టుబడి ఉండాలి.
అవతలి వారిని అంగీకరించానా?
ఈ ప్రపంచంలో పర్‌ఫెక్ట్ వ్యక్తులంటూ ఎవరూ ఉండరు, కానీ పర్‌ఫెక్ట్ కపుల్ మాత్రం ఉంటారు. అప్పటివరకూ జీవితాన్ని మన కోణం నుంచే చూడటానికి అలవాటుపడి గడిపేస్తుంటాం. హఠాత్తుగా మరో మనిషితో కలిసి బతకడం అన్నప్పుడు చిన్నచిన్న తేడాలు సహజం. ఎదుటివారిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తే.. ఆ తేడాలను సులభంగా అధిగమించేయవచ్చు. ‘భాగస్వామి’ అంటే మనకు నచ్చిన, నచ్చని అంశాల సమ్మేళనం. నచ్చిన వాటిని మెచ్చుకుంటూ.. నచ్చని వాటితో మీదైన శైలిలో వ్యవహరించేందుకు అంగీకరిస్తే.వారిని మనం పూర్తిగా అర్థం చేసుకున్నట్టే! అప్పుడు లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. పర్‌ఫెక్ట్‌కపుల్ అవ్వగలుగుతారు.
మాట్లాడుకోవడం.. ఇష్టమేనా?
ఇప్పటికే మీకు చాలామంది వ్యక్తులతో పరిచయం ఉండి ఉంటుంది. అందులో చాలా చాలా మందికి అసలు మాట్లాడటం సరిగ్గా రాదనే విషయాన్ని కూడా గమనించి ఉంటారు. నిజానికి స్పష్టంగా మాట్లాడటం అనేది ఒక కళ! అందులోనూ కోపంలోనో, బాధలోనో, సమస్యలోనో ఉన్నప్పుడు మాట్లాడటం ఇంకా కష్టం. కానీ పెళ్లిలో ఇవన్నీ తరచూ ఎదురయ్యేవే. మరి అలాంటి సమయంలో భావాలను సరిగ్గా అర్థమయ్యేలా మాట్లాడుకునేందుకు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది గమనించాలి. కూర్చుని మాట్లాడుకుంటే ఎంత పెద్ద సమస్యలైనా సమసిపోతాయి. కానీ, అలా మాట్లాడుకోగలగడమే పెద్ద సవాలు. మౌనం కొన్నిసార్లు సమస్య పెద్దది కాకుండా కాపాడవచ్చు, కానీ దీర్ఘకాలంలో అది దూరాన్ని పెంచుతుంది. అందుకే, మనసు విప్పిమాట్లాడుకునేందుకు సిద్ధంగా ఉండాలి.
ఇరు కుటుంబాల ప్రాధాన్యం?
కొందరు పెళ్లి తర్వాత మా వ్యక్తిగత జీవితం వేరు అనుకుంటారు.. మరికొందరు కుటుంబంగా భావిస్తూతల్లిదండ్రులు, తోబుట్టువులతో సొంత విషయాలు పంచుకుంటూ ఉంటారు. ఎవరిష్టం వారిది. కానీ ఇద్దరూ ఒకే విధంగా ఉన్నప్పుడే ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. ఒకరి కుటుంబంతో మరొకరు ఎలా ఉండగలరు, ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వగలరు అనేది ముందే ఆలోచించుకోవడం మంచిది.
బాధ్యతలు పంచుకుంటారా?
ఇంటి పని, ఖర్చులు, పిల్ల్లలు - పెద్దవాళ్ల పనులు. నిజానికి పెళ్లంటేనే చాలా పెద్ద బాధ్యత.భార్యాభర్తలిద్దరూ వీటిని పంచుకోగలిగితే సంసారం సజావుగా సాగుతుంది. అలా కాకుండా ఒకరిపైనే భారం పడితే ఇబ్బందులు తలెత్తుతాయి. పెళ్లిలో మీ వంతు బాధ్యతను నిజాయతీగా నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నారా అనేది ప్రశ్నించుకోవాలి.
ఇష్టాఇష్టాలను గౌరవిస్తారా?
ఏ రిలేషన్‌షిప్‌లో అయినా రెస్పెక్ట్ తప్పక ఉండాలి. ఎదుటివారి ఇష్టాఇష్టాలను, చాయిస్‌లను గౌరవించడం చక్కటి వివాహ బంధానికి మొదటిమెట్టు. అలా అని వారు చేసేవన్నీ నచ్చాలని లేదు. అలాంటప్పుడు సున్నితంగా అభిప్రాయాలను తెలియజేయగలగాలి. వారి మనసు నొప్పించకుండా మనోభావాలను
ప్రకటించగలగాలి. ఏది ఏమైనా వ్యక్తిగా గౌరవించగలగాలి.
రాజీపడగలరా?
నిజానికి కాంప్రమైజ్ అన్న విషయాన్ని తప్పుగా చూడటం మొదలయ్యాకే పెళ్లిళ్లలో సమస్యలు ఎక్కువయ్యాయంటారు మ్యారేజ్ కౌన్సెలర్లు. ‘నేను దేనితోనూ రాజీపడను’ అనే ధోరణి చాలా సందర్భాల్లో మనకు ఇబ్బందులే తెచ్చిపెడుతుంది. కుటుంబానికి, జీవితానికి, పిల్లల భవిష్యత్తుకు మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు కొన్నిసార్లు రాజీపడక తప్పదు. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒకసారి ఇలాంటి సందర్భంఎదురయ్యే ఉంటుంది. అదేమీ తప్పు కాదనే విషయాన్ని గుర్తించాలి.
డబ్బు పట్ల అభిప్రాయాలేంటి?
ఈ సమాజంలో ప్రతిఒక్కరూ తమ డబ్బును మేనేజ్ చేసే విధానం వేరువేరుగా ఉంటుంది. ఒకరు ఉన్నచిన్న జీవితంలో సంతోషంగా, సౌకర్యంగా బతకాలి అనుకోవచ్చు. మరికొందరు ఇప్పుడు జాగ్రత్తపడితేనే భవిష్యత్తుకు భరోసా అనుకోవచ్చు. దీనిపై భార్యాభర్తల్లో ఇద్దరికీ ఏకాభిప్రాయం కుదరకపోతే సమస్యలు వస్తాయి. అందుకే డబ్బు పట్ల మీ ఆలోచన ఏంటనే అంశంపై స్పష్టతకు రావడం అవసరం. అప్పుడే అవతలి వారి ఆలోచనలను అర్థం చేసుకోగలరు. ఇవి మాత్రమే కాదు.. ఇంకా లోతుగా విశ్లేషిస్తే చాలా విషయాలే కనిపిస్తాయి. అవన్నీ జాగ్రత్తగా ఆలోచించుకుని చక్కగా పెళ్లికి రెడీ అయిపోండి!
- చంద్రమౌళిక సాపిరెడ్డి.
2023-08-21 16:50:14